సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు
శోదన న్యూస్,మణుగూరు 13.10.2023, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఇన్స్పెక్టర్ రమాకాంత్ గారు హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేయవద్దని, వ్యక్తిగత దూషణకు దిగడం, వార్నింగ్ ఇవ్వడం, అంతర్గత వివరాలు గురించి అనవసర పోస్టులు, కామెంట్స్, సోషల్ మీడియాలో పెట్టవద్దని సూచించారు. సోషల్ మీడియా లో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీసులు నిరంతరం గమనిస్తూనే ఉంటారని, అలాంటి వారిపై చట్టప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాట్స్ అప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్న అడ్మిన్ లే బాధ్యత వహించాలని, సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని తప్పుడు, రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రా గ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకుని తప్పుడు, విద్వేష కర పోస్టులు చేస్తే, తగిన చర్యలు తప్పవన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని, ముఖ్యంగా యువత, వారి భవిష్యత్తును అనవసర పోస్ట్ ల ద్వారా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు.