కూలీలకు వంద రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలి
కూలీలకు వంద రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలి
-అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు
-వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలి
భూపాలపల్లి , శోధన న్యూస్ : కూలీలకు ఉపాధి హామీ పధకం పనులు కల్పించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయం నుండి ఉపాధి హామీ పథకం పనులు కల్పనపై ఎంపిడివోలు, కార్యదర్శులు, ఏపీఎంలు తదితరులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మండలంలో ఉపాధి హామీ పథకం పనులకు హాజరవుతున్న కూలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా 100 రోజులు పని దినాలు కల్పించాలని అన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 200 మంది కూలీలకు తగ్గకుండా పనులు కల్పించి 300 రూపాయలు వేతనం చెల్లించు విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పనులు కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఉపాది హామీ పథకం పనులు జరిగే స్థలాల వద్ద కూలీలకు త్రాగునీరు, నీడ కొరకు షేడ్ నెట్స్, ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పనులు చేపట్టాలని తెలిపారు.కూలీలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.కూలి పెరుగుదలకు చేపట్టాల్సిన అంశాలను ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ భవాని శంకర్ ప్రసాద్, జడ్పి సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డీఓ, అదనపు డిఆర్డీఓ, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎపీఎంలు తదితరులు పాల్గొన్నారు.