తెలంగాణభూపాలపల్లి

నీటి సమస్య ఏర్పడితే అధికారులపై చర్యలు

నీటి సమస్య ఏర్పడితే అధికారులపై చర్యలు

-భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి ,శోధన న్యూస్: వేసవిలో మంచి సమస్య తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.వేసవిలో మంచినీటి సమస్య రాకుండా చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి రెవిన్యూ, పంచాయతి రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ..వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో నీటి సమస్య ఉన్న గ్రామాలను ముందే గుర్తించి యుద్ధ ప్రాతిపదికన గ్రామాలలో ఉన్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాలలో నిరుపయోగంగా ఉన్న బోర్లు, చేతి పంపులను మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.త్రాగునీరు వృధా కాకుండా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గ్రామాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామస్థాయిలో ఉన్న నీటి సమస్యలపై పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓలు, గ్రామపంచాయితీ ప్రత్యేక అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పైప్ లైన్ లీకేజీలు అరికట్టి, నీరు వృధా కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నూతనంగా నిర్మించిన గృహాలకు నూతన పైపులైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందచేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు గ్రామాలలోని ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులను నెలలో మూడుసార్లు క్లీనింగ్ ప్రక్రియ చేపట్టి క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందివ్వాలని తెలిపారు.గ్రామాలలో నీటి సమస్య ఏర్పడితే స్థానిక గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శి ఎం పి ఓ ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గ్రామాలలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరిగేటప్పుడు మంచినీటి సరఫరా పైప్ లైన్లు దెబ్బతినకుండా ముందస్తు సమాచారం ఆర్ డబ్ల్యూ ఎస్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అస్తులను కాపాడుకోవాలని, ఎక్కడైనా మంచినీటి పైపు లైను పగిలిపోతే సంబంధిత శాఖ ద్వారానే మరమ్మత్తులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. నూతన డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణం జరిగేటప్పుడు పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి రోజు గ్రామాలలో నీటి సరఫరాలో ఏమైనా సమస్యలు వస్తే తక్షణమే అట్టి వివరాలను ఎంపీడీవోలకు తెలియ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే మూడు నెలలు ప్రజలు మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలని నీరు వృధా చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోకుండా కాపాడుకోవాలన్నారు. బోర్ వెల్స్, ఇంట్రా పైపు లైను మరమ్మత్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బోర్ వెల్స్ నిర్వహణ ఎవరు పర్యవేక్షణలో జరుగుతుంది, విద్యుత్ వినియోగం తదితర అంశాలపై నివేదికలు అందచేయాలని పంచాయతి, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులకు సూచించారు. వృధాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, దుర్వినియోగం జరిగితే చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని అన్నది మండలాల్లో ఉన్న బోర్ వెల్స్, చేతి పంపులు మ్యాపింగ్ చేయాలని, మ్యాపింగ్ చేయడం ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తద్వారా నీరు వృధా చేయు ప్రాంతాల్లో నీరు ఆదా చేయుటకు అవకాశం ఉంటుందన్నారు. మంచినీటి సమస్య వచ్చిన ప్రాంతాల్లో ఎంపిడిఓ, ఆర్ డ బ్ల్యూ ఎస్, మండల ప్రత్యేక అధికారులు పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *