అవగాహనతోనే ఎయిడ్స్ అంతం
అవగాహనతోనే ఎయిడ్స్ అంతం
– లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు డాక్టర్ రామకృష్ణ చౌదరి
– సికింద్రాబాద్‌లో విద్యార్థులతో ర్యాలీ, సెమినార్
హైదరాబాద్, శోధన న్యూస్ : అవగాహనతోనే ఎయిడ్స్ ను అంతమొందించవచ్చని లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు డాక్టర్ రామకృష్ణ చౌదరి కొడూరి అన్నారు. వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భాన్ని పురస్కరించుకొని ఉస్మానియా పీజీ కళాశాలలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి కార్యాలయం, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు డాక్టర్ రామకృష్ణ చౌదరి కొడూరి మాట్లాడారు. ఎయిడ్స్ గురించి ఇప్పటికీ సమాజంలో అనేక అపోహలు ఉన్నాయని, ఈ అపోహలను తొలగించడం ప్రతి పౌరుడి బాధ్యతన్నారు. ఎవరైనా రోగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం అంటే భయం కాదు, అది జాగ్రత్త. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే తొలి అడుగన్నారు. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారిని దూరంగా పెట్టడమంటే సమాజానికి మచ్చతేవడమేనని, వారికి అండగా నిలబడి ప్రోత్సహించడం మన మానవత్వం నిరూపించుకోవడం అన్నారు. రోగం ఉన్న వ్యక్తిని కాదు, రోగాన్ని ఎదుర్కోవాలని, దీనికోసం కుటుంబ సభ్యులు, విద్యార్థులు, యువత సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్న ఔషధాలు, చికిత్సలు చాలా మందికి తెలియడం లేదన్నారు.
ఈ సేవలను ప్రతి బాధితుడికి చేరవేయడం కోసం గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ.. అవగాహన పెరిగితేనే వ్యాధి వ్యాప్తి తగ్గుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, రోగ నిర్ధారణ పరీక్ష శిబిరాలు, ఆరోగ్య శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతలో ఈ వ్యాధి పట్ల చైతన్యం పెంపొందించడం అత్యంత ప్రధాన అంశమని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీని లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు రామకృష్ణ చౌదరి కోడూరి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు ఎయిడ్స్‌పై అవగాహన–మన అందరి బాధ్యత..సురక్షిత జీవనం–సమాజ ఆరోగ్యం.. అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు సందేశం చేరవేశారు.


