రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు
రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాచలం, శోధన న్యూస్: ఈ నెల 17వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి , మరుసటి రోజున జరగనున్న పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. సోమవారం భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఆయన పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు.సెక్టార్ల వారీగా ఇన్చార్జ్ అధికారులు తమ క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.సుమారుగా 2000 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలియజేసారు.భక్తుల కొరకు పార్కింగ్ స్థలాలు,లడ్డూ కౌంటర్లు,సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా పోలీసుల తరపున ప్రత్యేకంగా ఒక QR కోడ్ ను, అదేవిదంగా ఆన్లైన్ లింకు ( https://bhadrachalam.netlify.app ) ను రూపొందించడం జరిగిందన్నారు.