ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా సంబంధిత వర్గాలకు సకాలంలో రుణాలు అందజేసేందుకు బ్యాంకర్లు సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శనివారం ఐ డి ఓ సి కార్యాలయం లోని సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలో ఉన్న బ్యాంకర్లు , జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వశక్తి సంఘాల రుణాలు రికవరీ, పీఎం స్వానిధి రుణాలు,ఎఫ్ పిఒల ఏర్పాటు , ఇతర అంశాల పై డిసిసి, డిఎల్ఆర్ సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరం 2710 కోట్ల రూపాయల పంట రుణ లక్ష్యానికి మర్చి చివరి వరకు రూ.1400.24 కోట్లు రుణాలు అందించామని తెలిపారు.
రైతు రుణాల పంపిణీ అంశంపై బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. హెచ్ డి ఫ్ సి బ్యాంక్ , ఐసిఐసిఐ తక్కువ పంట రుణాల పంపిణీ గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు.రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను పంట రుణాలకు జమ చేసుకోవడానికి వీలు లేదని, సదరు నియమాలను బ్యాంకర్లు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా లో పెండింగ్ లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లకు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.గ్రామీణ ప్రాంతంలో బ్యాంకర్లకు అందాల్సిన గ్రూపు వివరాలు వెంటనే అందజేసేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పట్టణాలలో సైతం మెప్మా బృందాల వివరాలు బ్యాంకులకు అందించి రుణాలు మంజూరి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో , పట్టణ ప్రాంతాలలో వున్న స్వశక్తి సంఘాలు వున్న ఎన్ పీ.ఏ రుణాల రికవరీ పై శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, మరియు రాయితీల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, తద్వారా ప్రజలకు ఆదాయం చేకూర్చాలని కలెక్టర్ తెలిపారు.గిరిజనులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో వారి అభివృద్ధి కొరకు కూరగాయల సాగు, నర్సరీలు, కోల్డ్ స్టోరేజ్ మరియు వ్యవసాయం సులువుగా చేసుకునేందుకు వీలుగా ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లకు అవసరమైన రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లకు కలెక్టర్ తెలిపారు. డి ఆర్ డి ఏ, వ్యవసాయ శాఖ మరియు బ్యాంకర్లు దీనిపై దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు.అనంతరం నాబార్డ్ కు సంబంధించిన జిల్లా 2024-25 రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు .
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యాచందన, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సంజీవరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, ఏడిఏ రవి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డివో పృద్వి, సుజిత్ కుమార్ డిడిఎం నాబార్డ్, వివిధ బ్యాంకు మేనేజర్లు, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.