మున్సిపాలిటీల ఆదాయ, వ్యయాల నిర్వహణకు బడ్జెట్ ప్రణాళికలు రూపొందించాలి
మున్సిపాలిటీల ఆదాయ, వ్యయాల నిర్వహణకు బడ్జెట్ ప్రణాళికలు రూపొందించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కోత్తగూడెం,శోధన న్యూస్: మున్సిపాల్టీల ఆదాయ, వ్యయాల నిర్వహణకు బడ్జెట్ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన, పట్టణ ప్రగతి అంశాలపై మున్సిపల్ చైర్మన్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిఈలు, పారిశుధ్య అధికారులు, టిపిఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాల్టీలకు వచ్చే ఆదాయ వ్యయాలను బేరీజు వేసి ఎటువంటి పొరపాట్లుకు తావులేకుండా జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రూపాయి లెక్క తీయాలని చెప్పారు. బడ్జెట్ ప్రకారం అజెండా తయారు చేసి కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని పేర్కొన్నారు. బడ్జెట్ రూపకల్పన చాలా ముఖ్యమని, వాస్తవికంగా ఉండాలని, ప్రిలిమినరీ ద్వారా సమగ్ర అవగాహన వస్తుందని చెప్పారు. గత సంవత్సరం డ్రెయిన్లు, రహదారులు నిర్మాణానికి కేటాయించిన నిధులు, ఖర్చుల యొక్క నివేదికలు అందచేయాలని చెప్పారు. ఇంటింటి నుండి వ్యర్థాల సేకరణ ప్రక్రియ కొత్తగూడెంలో 72, పాల్వంచలో 81, ఇల్లందులో 96, మణుగూరులో 62 శాతం జరుగుతున్నదని, తక్కువ సేకరణ జరుగుతున్న వార్డుల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. చెత్త సేకరణలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్పిలను భాగస్వాములను చేయాలని చెప్పారు. వార్డుల వారిగా సేకరించిన తడి చెత్తను అక్కడే వర్మి తయారు చేయు విధంగా యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి వార్డులో వర్మి యూనిట్లు ఏర్పాటు కావాలని, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎఫ్ఎసిపిలలో గ్రీనరీ ఉండాలని, బ్రహ్మాందంగా ఉండాలని, ఫుట్పాత్లపై పాదచారులు నడిచే పరిస్థితి లేదని, పాదచారులు వెళ్లే విధంగా ఉండాలని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. డిఆర్ సిసిలో సక్సెస్ కం జెట్టింగ్ యంత్రాలు వినియోగించాలని, డిఆర్సిసిలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. ప్లాస్టిక్ వస్తువులు కంప్రెస్ చేయడానికి హైడ్రాలిక్ బెయిలింగ్, కన్వేయర్ బెల్టులు ఏర్పాటు చేయాలని చెప్పారు. బృహాత్ పల్లె పకృతి వనాల్లో డెన్స్ ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. మరణించిన వ్యక్తుల అంతిమ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి మున్సిపాల్టీలో గ్యాస్ ఆధారిత దహనవాటికలు ఏర్పాటు చేయాలని చెప్పారు. క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. తద్వారా మున్సిపాల్టీలకు ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు. రహదారులు పరిశుభ్రతకు స్వీపింగ్ యంత్రాలను వినియోగించాలని చెప్పారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల అధికారులకు సూచించారు. ఇట్టి సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల యాక్షన్ టేకెన్ రిపోర్టులను తయారు చేయాలని, తదుపరి నిర్వహించే సమావేశంలో సమీక్షించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వివరించారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఏ పి డి విద్యాచందన,కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ మరియు మణుగూరు మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఆడిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.