పని వేళలు మార్చండి
పని వేళలు మార్చండి
మణుగూరు, శోధన న్యూస్ : అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా కాంట్రాక్ట్ కార్మికుల పని వేళలు మార్చాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఇఫ్టూ) ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఎస్ఓటు జిఎం బి శ్యాంసుందర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇఫ్టూ జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పారిశుధ్యం రోడ్స్ క్లీనింగ్, ఉద్యానవనాల కాంటాక్ట్ కార్మికుల పని వేళలు మార్చాలని యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరారు. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకంలో నిర్వాసితులకు, ఉపాధి కోల్పోయిన వార్డు బాయ్ లకు న్యాయం చేయాలన్నారు. కాంట్రాక్టర్ల అవినీతిపై విచారణ జరిపించి నిర్వాసితులకు పరుగు పందెంలో అర్హత సాధించిన నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ప్రవేట్ సెక్యూరిటీ గార్డులు అందరికీ ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన ఇల్లందు ప్రైవేట్ కన్వీనెన్స్ వెహికల్ డ్రైవర్ కంపా ప్రసాద్ కుటుంబానికి భీమా, ఎక్స్ గ్రేషియా చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కాంటాక్ట్ కార్మికులందరికీ వాహన డ్రైవర్లకు పర్మినెంట్ కార్మికులకు ఇచ్చినట్లుగా ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అందజేయాలన్నారు. 2024 మార్చి 31 వరకు అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల సి ఎం పి ఎఫ్ జమ వివరాలతో కూడిన పాస్ బుక్ లు ఇవ్వాలి,ఏదైనా అత్యవసర పనులపై విధులకు హాజరుకాలేని కాంటాక్ట్ కార్మికులకు విధిస్తున్న అమానవీయ పెనాల్టీ రద్దు చేయాలన్నారు. కరోనాతో చనిపోయిన కొండాపురం సి.ఎస్.పి కాంట్రాక్ట్ కార్మికుడు పంగా మధుసూదన్ కుటుంబానికి రూ15 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు చేపట్టిన చర్యలు వేగవంతం చేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.