అగ్రికల్చర్ డ్రోన్ల పనితీరును పరిశీలించిన కలెక్టర్
అగ్రికల్చర్ డ్రోన్ల పనితీరును పరిశీలించిన కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : గోదావరి వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈసారి సరికొత్తగా వినియోగించనున్న అగ్రికల్చర్ డ్రోన్ల పనితీరును జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సోమవారం ఐడిఓసి ప్రాంగణంలో పరిశీలించారు. ఖమ్మం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డ్రోన్ పనితీరుపై డెమో విధానాన్ని, అదేవిధంగా పలువురు గజ ఈతగాళ్లు వరదల సమయంలో చేపట్టనున్న రక్షణ చర్యలను సైతం కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో వరదలు తాకిడి అధికంగా ఉంటుందని ఇందుకోసం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈసారి సరికొత్తగా అగ్రికల్చర్ డ్రోన్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రజలను వరద ముంపు నుంచి రక్షించేందుకు ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయని అన్నారు. వరదల్లో కోట్టుకపోతున్న వ్యక్తులను రక్షించేందుకు అగ్రికల్చర్ డ్రోన్లను ఉపయోగిస్తామని, అదేవిధంగా వరదల్లో చిక్కుకుపోయిన వ్యక్తులకు మంచినీటితో పాటు ఆహార పదార్థాలను వీటి ద్వారా అందిస్తామని తెలిపారు. ఈ డ్రోన్ 90 మీటర్ల ఎత్తు,250 మీటర్లు దూరం వరకు ఎగిరే అవకాశం ఉందని దీని ద్వారా వాగులు,లో లెవెల్ వంతెనల చిక్కుకుపోయిన వ్యక్తులకు తాళ్లను పంపి వారిని రక్షించవచ్చ అని తెలిపారు. అగ్రికల్చర్ డ్రోన్లను వినియోగించే విధానంపై సిబ్బందికి సరైన అవగాహన కల్పిస్తామన్నారు. వరదల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకుండా చూడాలన్నదే ప్రధాన ధ్యేయమన్నారు. అధికారులు వరదల సమయంలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఫిషరీస్ ఏడి వీరన్న, ఏఓ గన్యా,ఫైర్ సిబ్బంది,గజ ఈతగాళ్లు,తదితరులు పాల్గొన్నారు.