సీతారామ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
సీతారామ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
అశ్వాపురం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు సమీపంలో గల సీతారామ ఎత్తిపోతల పధకం పంప్ హౌస్ ను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆయనకు మ్యాప్ ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వివరించారు. ఈ పంపు ద్వారా 1500 క్యూసెక్కుల నీరు వస్తుందని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 4 పంపుల ద్వారా 104 కిలోమీటర్లు నీరు పంపుటకు ప్రధాన కాలువ సిద్ధంగా ఉందని, ఆగస్టు మాసంలో నీరు విడుదల చేయుటకు అన్ని పనులు పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.ఈ కాలువకు ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు అనుసంధానం చేయబడుతుందని తెలిపారు . తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో1.20 లక్షల ఎకరాలకు మొదటి విడతగా నీటి లభ్యత కల్పించబడుతుందన్నారు. ఈ విధంగా రాబోయే మూడు సంవత్సరాలలో విడతల వారీగా సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో 6.74 లక్షల ఎకరాలకు నీరు అందించబడునని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, సూపరిండెంట్ ఇంజనీర్లు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.