డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలిస్తాం
డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలిస్తాం
డ్రగ్స్ మహమ్మారిని కలిసి కట్టుగా ఎదుర్కొందాం
తాత్కలిక సంతోషం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
విద్యా సంస్థల్లో నిఘా పెట్టాం
-తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క
హైదరాబాద్, శోధన న్యూస్ : డ్రగ్స్ రహిత సమాజం కోసం అంత ప్రతినబూనాలని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పిలుపు నిచ్చారు. మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అంతా సహకరించాలని కోరారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి యువతి, యువకుడు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దురలవాటు , అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆద్వర్యంలో శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డ్రగ్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ లకు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సీతక్క గుర్తు చేసారు.
మాదకద్రవ్యాల మాఫియా ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని సీతక్క ఆవేదన వ్యక్తం చేసారు. మాఫియా కోట్లాది రూపాయలు కొల్లగొడుతుందన్న మంత్రి..యువతి యువకులు, విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.డ్రగ్స్ వాడితే కుటుంబాలు చితికిపోవడంతో పాటు మానసిక కుంగుబాటుతో అచేతనంగా మిగిలిపోవాల్సి వస్తుందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే సమాజంలో తలెత్తుకు తిరగలేరని తెలిపారు. మత్తు బానిసలను చీడపురుగులుగా మన సమాజం చూస్తుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. డ్రగ్స్, గంజాయి మత్తులో లైంగిక దాడులు, హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సింగరేణి కాలనీ, పెద్దపల్లిలో చిన్నారులపై లైంగిక దాడి హత్య ఘటనలు తనను ఎంతగానో బాధించిందన్నారు. ఇటీవల జరిగిన అఘాయిత్యాలన్ని డ్రగ్స్ మత్తులో జరిగినవేనన్నారు
. మత్తు కు బానిసలు అయ్యి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యి సమాజంలో విలువలు లేకుండా బ్రతుకుతున్నారని గుర్తు చేసారు. డ్రగ్స్ తీసుకున్నవారికి కాసేపు ఉత్సహం రావచ్చని..కాని అనంతరం శాశ్వతంగా బానిసలు అయ్యి సమాజంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదన్నారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అంతా కలిసి కట్టుగా పోరాడం చేద్దామని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు, యువత నడుచుకుని వారి కలలను సాకారం చేయాలని కోరారు. క్షణికావేశంలో చేసే తప్పిదాల వల్ల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందనే విషయాన్ని గుర్తెరిగి నడుచుకోవాలని తెలిపారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెడు వ్యసనాలు త్వరగా ప్రభావితం చేస్తాయన్న మంత్రి సీతక్క..వాటి నుంచి దూరంగా ఉండాలని కోరారు. అన్ని విద్యా సంస్థలు, ఇతర సంస్థల్లో నిఘా పెట్టామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజంకోసం అంతా కలిసి కట్టుగా పోరాడం చేద్దామని పిలుపు నిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడుతామని మంత్రి సీతక్క ప్రతిజ్ఞ చేయించారు
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఇండియన్ విమెన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ పద్మశ్రీ మిథాలి రాజ్, సీనియర్ నటులు సుమన్, హన్ మాన్ ఫేం యువ హీరో శ్రీ తేజ సజ్జ, డీజీపీ రవి గుప్తా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, డీసీఏ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, వికలాంగులు, వయోవృద్ధులు సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.