క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలి
క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలి
– రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం,శోధన న్యూస్: తెలుగువారి కొత్త ఏడాది అయిన శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అంతా మంచి జరగాలని, రాష్ట్రంతో పాటు దేశం మంచి దిశగా పయనించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ లో జిల్లా ధూప, దీప నివేదన అర్చక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి ఏడాది రౌద్రావతారంలో ఉంటుందని పండితులు చెబుతున్నారని.. చల్లగా సాగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి.. హైదరాబాదులో అర్చకులతో సమావేశం నిర్వహించి ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా ఉండే అర్చకులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని అభయం ఇచ్చారు. అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అర్చకులు మంత్రి పొంగులేటిని సత్కరించారు.