వడ దెబ్బల నియంత్రణ చర్యలు చేపట్టాలి
వడ దెబ్బల నియంత్రణ చర్యలు చేపట్టాలి
-తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
హైదరాబాద్,శోధన న్యూస్: రానున్న రెండు నెలల పాటు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని, ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాలని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వేసవి తాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, హీట్ స్ట్రోక్, పాఠశాలల మౌలిక వసతుల కల్పనపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు , అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)చంద్రశేఖర్ (రెవెన్యూ) మాధురి సంబంధిత అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి సరఫరాపై అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకొని సన్నద్ధంగా ఉన్నామని, ప్రతి రోజు తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని, ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరా నిమిత్తం మిషన్ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. తాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. గ్రామస్థాయిలో రానున్న రెండు నెలలకు తాగునీటి సరఫరా కార్యాచరణ రూపొం దించుకోవాలని సీఎస్ సూచించారు. అత్యవసర పరిస్థితులలో స్థానికంగా ఉన్న వ్యవసాయ మోటార్లను వినియోగించుకోవాలని, పట్టణాలలో గ్రామాలలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సప్లిమెంట్ చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు తగ్గి పోతున్నాయని, పట్టణాలు, నగరాలలో, గ్రామీణ ప్రాంతాలలో సైతం ట్యాంకర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే సకాలంలో సరఫరా చేసే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రం లేని కారణంగా రైతులు ప్రైవేట్ కు తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తున్నారనే మాట రావద్దని సీఎస్ స్పష్టం చేశారు. రాబోయే 4 రోజుల్లో 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ అంశంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2203, సాధారణ రకం ధాన్యానికి 2183 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మన రైతుల వద్ద నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టులను అప్రమత్తం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరా, టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సీఎంఆర్, రా రైస్ డెలివరీపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకుని రావడం, అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల మైనర్ మేజర్ మరమ్మత్తులు తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం కల్పన వంటి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రతి మండలంలో పనుల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీని నియమించాలని, క్షేత్రస్థాయిలో మరోసారి పాఠశాలలను తనిఖీ చేసి పక్కాగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ప్రతి మండల స్థాయిలో పాఠశాల మౌలిక వసతుల కల్పనపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవో, పాఠశాల నిర్వహణ కమిటీలో ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వడ దెబ్బల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదవుతున్నాయని, ఏప్రిల్, మే నెలలో ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సీఎస్ తెలిపారు. వడదెబ్బ తగిలిన వారికి అవసరమైన ప్రథమ చికిత్స సత్వరమే అందేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఉపాధి హామీ పనులను ఉదయం పూట నిర్వహించాలని, ఉపాధి హామీ పనుల నిర్వహణ సమయంలో కార్మికులకు అవసరమైన మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు . వడ గాలులు వీస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని, బయటకు వస్తే అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథకు సంబంధించి ప్రతి మండలం, గ్రామ పంచాయతీకి ఇద్దరు స్పెషల్ ఆఫీసర్ లను నియమించాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, ఎంఎస్వో లు, జీపీఎస్వోలు గ్రామ స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ను రూపొందించాలన్నారు. ఈజేఎస్ పెండింగ్ పనులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పాఠశాలల మరమ్మతు పనుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మిగతా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ హెల్త్ కి సంబంధించి సబ్ సెంటర్ల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో, ఆశాలకు, ఉపాధి హామీ సెంటర్ల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైతు వేదికల వద్ద, తహసీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాల్లో, కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలాగే వేసవి కాలం దృష్ట్యా ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ వనజ , డి సి ఓ టి ప్రసాద్ , డీఆర్డీఓజ్యోతి , డి పి ఓ సాయిబాబా , వ్యవసాయశాఖ జే డి నర్సింహారావు , మిషన్ భగీరథ్ ఎస్ ఈ రఘువీర్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.