పాఠశాల బస్సులను తనిఖీ చేసిన ఇంచార్జ్ ఆర్టీఓ
పాఠశాల బస్సులు తనిఖీ చేసిన ఇంచార్జ్ ఆర్టీఓ
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని పాఠశాలల బస్సులను గురువారం కొత్తగూడెం ఇంచార్జ్ ఆర్టీఓ, భద్రాచలం ఎంవీఐ తోట కిషన్ రావు తనిఖీ చేశారు. అనంతరం డ్రైవర్లకు, పాఠశాలల యజమానులకు కలిపి సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో ఇంచార్జ్ ఆర్టీఓ కిషన్ రావు మాట్లాడుతూ … డ్రైవర్లు ఎల్లవేళల అప్రమత్తంగా ఉండాలని, విధినిర్వహణలో మద్యం సేవించకూడదని, అలాగే ఫోన్ మాట్లాడకూడదన్నారు. ట్రాఫిక్ నిబంధనలకు లోబడే బస్సు నడపాలని, ఖచ్చితంగా ట్రాఫిక్ నిబందనలు పాటించాలని సూచించారు. బస్సులు ఎల్లప్పుడు కండిషన్ లో ఉండేలా చూసుకోవాలని, బస్సులో చిన్నారులకు ఇబ్బంది కలగకుండా సీట్లు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. బస్సులో ఏర్పడే టెక్నికల్ సమస్యలను గుర్తించి వెంటనే బస్సు యజమానికి తెలియజేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉంటుందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల యజమానులు యూసఫ్ షరీఫ్, శ్రీనివాస రావు, ఐజక్ థామస్, రెడ్డి, బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.