తెలంగాణమహబూబాబాద్

పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

మహబూబాబాద్ ,శోధన న్యూస్: పాఠశాలలో మౌలిక వసతుల పనులు అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా పూర్తి చేయాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడ దెబ్బల నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. త్రాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు, పాఠశాల మౌలిక వసతుల కల్పన పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రానున్న రెండు నెలల పాటు పక్కా ప్రణాళికతో త్రాగునీటి సరఫరా చేపట్టాలని , ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వేసవి త్రాగునీటి సరఫరా ప్రణాళిక,ధాన్యం కొనుగోలు, పాఠశాల మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ వేసవి కాలంలో త్రాగునీటి సరఫరా పై అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉన్నామని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. త్రాగునీటి సరఫరా నిమిత్తం మిషన్ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా త్రాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలని అన్నారు. త్రాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో , గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలని సి ఎస్ కలెక్టర్లకు సూచించారు.మిషన్ భగీరథ వ్యవస్థ, స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రూపొందించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలను వినియోగించుకుంటూ గ్రామస్థాయిలో రానున్న రెండు నెలలకు త్రాగునీటి సరఫరా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. అత్యవసర పరిస్థితులలో స్థానికంగా ఉన్న వ్యవసాయ మోటార్లను వినియోగించు కోవాలని సిఎస్ అధికారులకు సూచించారు. పట్టణాలలో గ్రామాలలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సిఎస్ పేర్కొన్నారు. రానున్న రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో త్రాగునీటి సరఫరా లో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, త్రాగునీటి సరఫరా ను ప్రతిరోజు పర్యవేక్షించాలని సీఎస్ పేర్కొన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు తగ్గి పోతున్నాయని, పట్టణాలు , నగరాలలో, గ్రామీణ ప్రాంతాలలో సైతం ట్యాంకర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే సకాలంలో సరఫరా చేసే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రం లేని కారణంగా రైతులు ప్రైవేట్ కు తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తున్నారనే మాట రావద్దని సీఎస్ స్పష్టం చేశారు. రాబోయే 4 రోజుల్లో 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ అంశంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2203/- , సాధారణ రకం ధాన్యానికి 2183/- మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టులను అప్రమత్తం చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా ,టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని సి ఎస్ అన్నారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సి.ఎం.ఆర్, రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకుని రావడం, అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మత్తులు తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం కల్పన వంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రతి మండలంలో పనుల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ నియమించాలని క్షేత్రస్థాయిలో మరో సారి పాఠశాలలను తనిఖీ చేసి పక్కగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎస్ అన్నారు. ప్రతి మండల స్థాయిలో పాఠశాల మౌలిక వసతుల కల్పన పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ,ఎంపీడీవో , పాఠశాల నిర్వహణ కమిటీ లో ఉన్న స్వశక్తి మహిళా సంఘాల తో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని , ప్రతి పాఠశాలలో అవసరమైన పనులు పాఠశాలలు ప్రారంభం అయ్యే ముందే పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ఎండల తీవ్రత రోజు రోజుకు కు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వడ దెబ్బల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదు అవుతున్నాయని, ఏప్రిల్, మే నెలలో ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సిఎస్ తెలిపారు. వడదెబ్బ తగిలిన వారికి అవసరమైన ప్రథమ చికిత్స సత్వరమే అందేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఉపాధి హామీ పనులను ఉదయం పూట నిర్వహించాలని, ఉపాధి హామీ పనుల నిర్వహణ సమయంలో కార్మికులకు అవసరమైన మీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అన్నారు. వడ గాల్పులు వీస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని, బయటకు వస్తే అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వడ గాల్పులు గురైన వ్యక్తులకు వెంటనే అవసరమైన ప్రధమ చికిత్స చేసి సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్, అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించి జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు సలహాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *