కార్మిక చట్టాల పరిరక్షణ ఉద్యమ దినంగా మేడే నిలవాలి.
కార్మిక చట్టాల పరిరక్షణ ఉద్యమ దినంగా మేడే నిలవాలి
భద్రాద్రి కొత్తగూడెం,శోధన న్యూస్: పేదల పక్షాన నిలబడి వారి హక్కు సాధనకై పాలకులను నిలదీసే బలమైన గొంతుక ఎర్ర జెండా అని, ఎర్ర జెండా ఎంత బలపడితే పేదలకు, శ్రామిక వర్గానికి సరైన న్యాయం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. మేడే వారోత్సవాల ప్రారంభం సందర్బంగా సిపిఐ, ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నందు వంగ వెంకట్, వట్టికొండ మల్లికార్జున్ రావు, ఎస్ వి రమణమూర్తి అధ్యక్షతన జరగా.. మేడే స్ఫూర్తి సదస్సులో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. 1986లో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనివిధానంకోసం జరిగిన సమ్మె ఉద్యమంలో పాలకులు, యాజమాన్యం జరిపిన కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిందే ఈ ఎర్రజెండా అని పేర్కొన్నారు. వారి అమరత్వంతోనే ఎనిమిది గంటల పనివిధానంతోపాటు అనేక కార్మిక చట్టాలు, హక్కులు ఏర్పడ్డాయని, చికాగో అమరుల స్పూర్తితో భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలకు ఏలికలు దిగిరాక తప్పలేదన్నారు. బ్రిటీష్ రాజ్యంలో, ఆ తర్వాత స్వతంత్ర భారతంలో పాలకులతో పోరాడి, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను ఏకమొత్తంగా బిజెపి ప్రభుత్వం రద్దు చేస్తోందని, మేడే స్ఫూర్తిగా సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని, యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును కూడా హరించి యాజమాన్యాలకు కార్మికుల శక్తిని దోచిపెట్టే కుట్రలకు పాల్పడుతోందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చట్టసభల్లో ఉన్న మందబలంతో కార్మిక, ఉద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ గోసపెడుతోందని, పోరాడి సాధించుకున్న 29 చట్టాలను యజమానులకు అనుకూలంగా నాలుగు కోడులుగా మార్పు చేసిందని అన్నారు. మోసపూరిత కుట్రలు, కుతంత్రాలతో మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, లాభాల్లో నడుస్తున్న సింగరేణి గనులు, రవాణా, టెలికాం, రైల్వే, బ్యాంకులు, ఎలసి, రక్షణ రంగం, ఇస్రో లాంటి తదితర ప్రభుత్వరంగ సంస్థలను కూడా ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అప్పణంగా కారు చౌకగా బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తున్నారని విమర్శించారు. ప్రజలకోసం కాకుండా ఆర్ధిక బకాసురులకు, ఆర్ధిక నేరగాళ్ళగా మోడీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు. దేశ సంపద, కార్మిక చట్టాల పరిరక్షణ ఉద్యమ దినంగా దేశ వ్యాప్తంగా మేడేను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.