ఖమ్మంతెలంగాణహైదరాబాద్

వ్యవసాయ రంగంలో గేమ్‌చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్

వ్యవసాయ రంగంలో గేమ్‌చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్

– సంక్రాంతి నాటికి   మెగా ఫుడ్ పార్క్‌లో మరికొన్ని పరిశ్రమల ప్రారంభం

–  ఫుడ్ పార్క్ పురోగతిపై మంత్రి తుమ్మల – పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష

*ఖమ్మం / హైదరాబాద్, డిసెంబర్ 16, శోధన న్యూస్:

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్‌చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ మారనుందని తెలంగాణా రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి *శ్రీధర్ బాబు*తో కలిసి బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ పార్క్‌లో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసి, *సంక్రాంతి నాటికి పరిశ్రమల కార్యకలాపాలు ప్రారంభించేలా* సంబంధిత అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

– రూ.615 కోట్ల ఆక్వా ప్రాజెక్ట్ – 3,200 మందికి ఉపాధి:

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌లో  దీపక్ నెక్స్ జెన్ గ్రూప్  రూ.615 కోట్ల పెట్టుబడులతో భారీ ఆక్వా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనుండగా, దీనివల్ల సుమారు *3,200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు* లభించనున్నాయని . ఇప్పటికే 26 ఎకరాల్లోని 26 ప్లాట్లను పలు పరిశ్రమలకు కేటాయించారని మంత్రి తుమ్మల తెలిపారు. గొర్లాస్ గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫినిటీ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ప్లాట్లు కేటాయించగా, తాజాగా దీపక్ నెక్స్ జెన్ ఆక్వా ప్రాజెక్ట్‌కు స్థలం కేటాయించినట్లు తెలిపారు.

– గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం – ప్రస్తుత ప్రభుత్వంలో వేగం:

2016 ఫిబ్రవరి 5న కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పిఎంకేఎస్ వై పథకం  కింద సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 60 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఫుడ్ పార్క్‌కు అనుమతి లభించింది. నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్ట్‌కు పునాదులు వేశారు. అయితే గత ప్రభుత్వ కాలంలో తొమ్మిదేళ్ల పాటు ఈ ఫుడ్ పార్క్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేకపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఇప్పటికే రెండు దఫాలు సమీక్షలు నిర్వహించారు.

-సిపిసి  హబ్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్:

పొలం నుంచి మార్కెట్ వరకు రైతుల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌ను *కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (సిపిసి) హబ్*గా అభివృద్ధి చేస్తున్నారు. సిపిసి కి మద్దతుగా ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు (పిపిసిలు), సేకరణ కేంద్రాలు (సిసిలు) పనిచేయనున్నాయి. ప్రస్తుతం ఒక సిపిసి , రెండు పిపిసి ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.109 కోట్లు కాగా, ఇందులో రూ.99 కోట్లు ప్రాజెక్ట్ వ్యయం. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.28 కోట్ల గ్రాంట్ అందింది.

– వ్యూహాత్మక లొకేషన్‌లో ఫుడ్ పార్క్:

రోడ్డు, రైల్వే, పోర్ట్ కనెక్టివిటీ ఉన్న *స్ట్రాటజిక్ లొకేషన్*లో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. 150 కి.మీ పరిధిలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పౌల్ట్రీ వనరులు లభ్యమవడం ఈ ప్రాంతానికి ప్రధాన బలం అని అన్నారు.

-యువతకు ఉపాధి కేరాఫ్:

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌తో ఖమ్మం జిల్లా మాత్రమే కాకుండా పరిసర జిల్లాల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని, యువతకు ఉపాధి కల్పనలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో  ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ IAS, TGIIC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శశాంక IAS, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ సుష్మ, TGIIC ఈడీ పవన్ కుమార్*, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సభ్యులు శ్రీరామ్, ఆర్లిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *