లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు
లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు
-భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళపల్లి మండలం అడవి రామారం కు చెందిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఇల్లందు, నర్సంపేట దళ కమిటీ దళ సభ్యుడు పూనెం అడమయ్య అలియాస్ గణేష్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందుకు సంబందించిన వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పూనెం అడమయ్య 2023 జనవరిలో మావోయిస్టు పార్టీలో చేరి,రెండు నెలలు పాటు పార్టీలో కొరియర్ గా పనిచేసి తరువాత ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్సి భద్రు అలియాస్ పాపన్న దళంలో దళ సభ్యునిగా పనిచేస్తున్నాడని తెలిపారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, జెఎంఎం డబ్ల్యూ ఏరియా కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ మరియు ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ నాయకులు చెప్పిన మాయ మాటలకు ఆకర్షితుడై మావోయిస్ట్ పార్టీలో చేరాడని పేర్కొన్నారు. గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి చత్తీస్గడ్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైందని, కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా, కమిటీలను ఏర్పాటు చేసి బలవంతపు వసూల్లే లక్ష్యంగా పనిచేస్తూ, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయాలన్నింటిని గ్రహించిన పూనెం అడమయ్య అలియాస్ గణేశ్ మావోయిస్ట్ పార్టీని వీడి శనివారం పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందన్నారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గాని, స్వయంగా గాని తమ దగ్గరలో గల పోలీసు స్టేషన్ లో లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద గాని సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. లొంగిపోయే దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరుపున అందవలసిన అన్నీ రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశం లో సిఐ ముత్యం రమేష్, పోలీస్ అడికారులు, సిబ్బంది పాల్గొన్నారు.