పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క
అచ్చంపేట, శోధన న్యూస్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేశారు. తెలుగుపల్లిలో కస్తూర్బా పాఠశాల ప్రారంభోత్సవం చేశారు. తెలుగు పల్లి గ్రామపంచాయతీ భవనానికి , ఎల్లంపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, అమ్రాబాద్ లో జూనియర్, డిగ్రీ కాలేజీ ల కాచిగూడ నిర్మాణానికి , రాయల గండి దేవస్థానం అభివృద్ధి పనులకు, జింకుంట మామిళ్ళపల్లి బీటీ రోడ్డు పనులకు,
మామిళ్ళపల్లి దేవాలయ ఆవరణలో కళ్యాణ మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉప్పరపల్లి మామిళ్ళపల్లి మధ్య బిటి రోడ్డును, ఉప్పరపల్లి లో డిజిటల్ క్లాస్ రూమ్, సింగల్ విండో గోదాంను ప్రారంభించారు. అనంతరం అచ్చంపేటలోని కెఎస్ఆర్ గార్డెన్లో జరిగే మహిళ సమ్మేళనంలో మంత్రి సీతక్క స్వయం సహాయక సంఘాలకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ తో పాటు ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.