నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
-భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.ఇందులో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పారా మిలిటరీ బలగాలతో కలిసి పట్టణంలోని లక్ష్మీదేవిపల్లి, సూపర్ బజార్ మరియు బస్టాండ్ మీదుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ ఈ ఫ్లాగ్ మార్చ్ సాగింది. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్, సీఐలు,ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ట్రైనీ ఐపిఎస్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు భరోసా కల్పించడంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా,గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అక్రమ మద్యం,నగదు రవాణాకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.