తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడవద్దు
తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడవద్దు
ట్యాంకులు, సంపులను తరచూ శుభ్రం చేయించాలి
-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్,శోధన న్యూస్: వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కొత్తపల్లి మండలం కమాన్ పూర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద, చింతకుంట లోని వినాయక నగర్ లో ఎస్డీఎఫ్ నిధులతో కొత్తగా వేసిన బోర్ వెళ్లను పరిశీలించారు. బోర్వెల్లు ఎన్ని ఫీట్లు వేశారు.తాగునీటి సరఫరా ఎలా ఉందని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉన్నచోట వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కమాన్పూర్ లో స్థానిక మహిళలతోనూ జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మిషన్ భగీరథ నీరు సరిగా వస్తున్నదా.. ఎంతసేపు సరఫరా చేస్తున్నారు.ఇక్కడ తాగునీటికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు సిబ్బందితో శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు. బ్లీచింగ్ పౌడర్ సైతం ట్యాంకుల్లో చల్లాలని తెలిపారు. అదేవిధంగా నాచు పేరుకు పోకుండా తరచూ సంపులను శుభ్రంm చేయించాలని పేర్కొన్నారు. అపరిశుభ్రంగా ఉన్న నీరు తాగితే ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరం ఉన్నచోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని సూచించారు.