పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భాద్యతగా విధులు నిర్వర్తించాలి
పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భాద్యతగా విధులు నిర్వర్తించాలి
-శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
-భద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా పోలీస్ అధికారులు,సిబ్బంది భాద్యతగా విధులు నిర్వర్తించాలని భద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ సందర్బంగా ఈవీఎం ల తరలింపు,పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కొత్తగూడెం క్లబ్ ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా రూట్ మొబైల్స్ ఇంచార్జి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ విధుల పట్ల అధికారులకు,సిబ్బందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రవర్తించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మన వంతు కృషి చేయాలన్నారు. రౌడీ షీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకొని ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయిమనోహర్, ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్, డిఎస్పీలు రెహమాన్, చంద్ర భాను, సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, సీఐలు, ఎస్సైలతో పాటు రూట్ మొబైల్స్ ఇంచార్జ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.