గిరిజన రైతుల సమస్యలపై ఐటిడిఏ పీఓకు వినతి
గిరిజన రైతుల సమస్యలపై ఐటిడిఏ పీఓకు వినతి
పినపాక నియోజకవర్గం ప్రతినిధి, ఏప్రిల్ 10, శోధన న్యూస్:
గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐటిడిఏ పీఓ రాహుల్ కు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పినపాక మండలం బోటిగూడెం పంచాయతీ పరిధిలోని పోడు భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయం కోరారు. గిరిజన రైతులు దీర్ఘకాలంగా పోడు భూముల హక్కుల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు . సాగు భూములపై హక్కులు కల్పిస్తే గిరిజన కుటుంబాల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.
అలాగే కరకగూడెం మండలంలోని పోడు వ్యవసాయ భూములకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయన ఐటిడిఏ పీఓను కోరారు. త్రీఫేజ్ విద్యుత్ అందుబాటులోకి వస్తే సాగు పనులు సులభతరం కావడంతో పాటు పంట దిగుబడులు పెరుగుతాయని ఎమ్మెల్యే పాయం తెలిపారు. ఆయా అంశాలపై ఐటిడిఏ పీఓ రాహుల్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.


