ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి
-పోలీస్ స్టేషన్ల సందర్శనలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఇల్లందు సబ్ డివిజన్ లోని గుండాల, ఆళ్లపల్లి, కొమరారం, బోడు ఏజెన్సీ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు. సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అలాగే నిషేధిత మావోయిస్టుల కదిలికలపై కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.