ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
-భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం
-తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలం, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని బొమ్మను చూపించి ప్రజలను మాయ చేశాడని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే అత్యధిక ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ఇందిరమ్మ అభయ హస్తం లో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని, ఐదవ గ్యారెంటీ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం సోమవారం భద్రాచలం రామయ్య పాదాల సన్నిధిలో ముఖ్య మంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు కేటాయుంచడమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు. మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో స్థలం ఉన్న వారికి 3,500 ఇండ్లు గ్రామ సభల ద్వారా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రెండవ విడత స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి గిరిజనులు, దళితులకు రూ.6 లక్షలు, ఇతరులకు రు.5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జెడ్పీ చైర్మన్ చంద్ర శేఖర్ రావు, మాజీ ఎమ్మెల్యే పొదేం వీరయ్య, మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తదితరులు పాల్గొన్నారు.