ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి
ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ఎన్నికైన అన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు పనులు చేయించే విధానంపై బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశమందిరం లో డి ఆర్ డి ఓ విద్యచందన తో కలిసి నీటిపారుదల, పంచాయతీరాజ్, అర్అండ్బీ, మున్సిపల్, పీఎస్ఈడబ్ల్యూఐడీసీ, ఈఈలతో వీడియోకాన్ఫిరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 643 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరు అయిన పనులు అన్నిటినీ రేపటికల్లా ప్రారంభించి,మే నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి సంబంధించిన ప్రణాళికలను అన్ని శాఖల సమన్వయంతో సమర్పించాలని ఆదేశించారు. కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలో తాగునీరు, తరగతి గదుల్లో చిన్నచిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పని ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పటికీ పూర్తి అవుతుందో ఖచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మే 31 లోగా మంజూరు అయిన ప్రతి పనిపూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఎలక్ట్రికల్, త్రాగునీరు, టాయిలెట్ మొదలగు పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పని మొదలుపెట్టేముందు పూర్తి అయిన తర్వాత ఫొటోస్ ఆప్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ బ్యాంకులలో కమిటీల ఖాతాలు తెరిపించాలని అన్నారు. ప్రతిరోజు పనుల పురోగతిపై నివేదికలు అందజేయాలన్నారు.
– నీటి ఎద్దడి సమస్య రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి:
వేసవి నీటి ఎద్దడి సమస్య రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మందికి తగ్గకుండా ఉపాధి హామీ పనులు చేపట్టాలని, ప్రతి గ్రామంలో త్రాగునీటి సరఫరాను ప్రతిరోజు పరిశీలించాలన్నారు. త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తిన యెడల సత్వరమే చర్యలు చేపట్టి తాగునీటికి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఇంటికి నీటి సరఫరా జరగాలని ఎంపిఓ లను, పంచాయతీ సెక్రెటరీ లను సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో అధిక ఉష్ణోగ్రతల దృశ్య రానున్న రోజుల్లో అత్యవసరమైతే తప్ప సెలవులపై వెళ్లరాదని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో గాలి దుమ్ములు వచ్చే అవకాశం ఉన్నందున మున్సిపల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్ లు శుభ్రంగా వుండు విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.