రైస్ మిల్లులు సి.ఎం.ఆర్. ప్రక్రియను పూర్తి చేయాలి
రైస్ మిల్లులు సి.ఎం.ఆర్. ప్రక్రియను పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
హైదరాబాద్, శోధన న్యూస్: జిల్లాలో రైస్ మిల్లులకు నిర్దేశించిన సి.ఎం.ఆర్. లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భారత ఆహార సంస్థ గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సి.ఎం.ఆర్. ప్రక్రియలో భాగంగా రా రైస్ మిల్లులు ప్రతి రోజు 1 ఎ.సి.కె, బాయిల్డ్ రైస్ మిల్లులు 2 ఎ.సి.కె. పూర్తి చేసేలా చర్యలు తీసుకొని లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మంచిర్యాలలో ఎఫ్.సి.ఐ. గోదాము స్థలం కేటాయించకపోవడంతో బియ్యం దిగుమతిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైస్ మిల్లర్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో కరీంనగర్ డివిజనల్ మేనేజర్తో మాట్లాడి వాగన్ మూమెంట్ త్వరితగతిన చేపట్టి జిల్లాలోని మిల్లర్లు సి.ఎం.ఆర్. బియ్యం దిగుమతి పెరిగే విధంగా ఎఫ్.సి.ఐ.లో స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ ధాన్యాన్ని ట్యాగింగ్ కలిగిన రైస్ మిల్లులకు వాటి సామర్థ్యానికి అనుగుణంగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైస్మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు.