రైతు భరోసా పథకం సాగు చేస్తున్న రైతులకే అందించాలి
రైతు భరోసా పథకం సాగు చేస్తున్న రైతులకే అందించాలి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : రైతు భరోసా పథకంపై రైతులు అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. మంగళవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ లో రైతు నేస్తం అనే కార్యక్రమం ద్వారా ఐదు రైతు వేదికలలో పాల్గొన్న రైతులతోఆయన మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రైతు వేదిక చొప్పున ఐదు రైతు వేదికల్లో లక్ష్మీదేవి పల్లి,కోయగూడెం, ములకలపల్లి,బూర్గంపాడు మరియు చర్ల లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీదేవి పల్లి రైతు వేదికలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొని రైతులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. మన జిల్లాలో పాల్గొన్న 434 మంది రైతులు మాట్లాడుతూ రైతు భరోసా ద్వారా సాగు చేస్తున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరాలని, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా వర్తింప చేయవద్దని విజ్ఞప్తి చేసి, వ్రాతపూర్వకంగా నివేదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఏ డి ఏ లు రమేష్, రవికుమార్, అరుణ్ బాబు, దీపక్ ఆనంద్, సాయినారాయణ, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు హాజరయ్యారు.