హై పవర్ కమిటీ వేతనాల అమలు కై చర్చించాలి
సింగరేణి కాంటాక్ట్ కార్మికుల హై పవర్ కమిటీ వేతనాల అమలు కై చర్చించాలి
– కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ కు వినతి
మణుగూరు, శోధన న్యూస్ : పార్లమెంటుకు ఎంపికైన మరుక్షణం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ కమిటీ వేతనాల అమలుకై పార్లమెంటులో చర్చించాలని కోరుతూ ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కి ఆదివారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐఎఫ్ టి యు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఏప్రియల్ ఒకటి నుండి దేశవ్యాప్తంగా బొగ్గు గనులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అమలకు ఆదేశాలు ఉన్నప్పటికీ కోల్ ఇండియాలో అమలు అవుతున్నప్పటికీ సింగరేణిలో ఇప్పటివరకు అమలు కాకపోవటం బాధాకరమన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆయన ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందేమోనన్న ఆశతో కాంటాక్ట్ కార్మికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. అలాగే నిర్వాసితులకు న్యాయం చేయాలని, మణుగూరు సమీప గ్రామాల అభివృద్ధికి, ఆదివాసి, గిరిజన గ్రామాల లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆయన కోరారు. ఆయా సమస్యలపై పొరిక బలరాం నాయక్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రధాన పార్టీల పార్లమెంటు అభ్యర్థులందరు అందుబాటులో లేకపోతే ఆయా పార్టీల ప్రతినిధులకు ఈ మేరకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు మంగీలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో k. గురుమూర్తి యు శివరామకృష్ణ, జి శ్రీనివాస్, టి రాము, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.