ఆదివాసి గిరిజన గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి
ఆదివాసి గిరిజన గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి
-ఇఫ్టూ ఆధ్వర్యంలో పినపాక ఎమ్మెల్యే కి వినతి
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని గిరిజన ఆదివాసి గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ )ఆధ్వర్యంలో మంగళవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి వ్యతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ పినపాక నియోజకవర్గ పరిధిలోని మణుగూరు అశ్వాపురం, పినపాక మండలాల్లోని ఆదివాసి గిరిజన గ్రామాలైన బుగ్గ, ఖమ్మం తోగు, బుడుగుల, రేగుల గండి, రాయన్నపేట, సర్వాయి గుంపు, పెద్దిపల్లి, విప్పల గుంపు, కుమ్మరి గుంపు, మనుబోతుల గూడెం, మామిళ్ళ వాయి, గుండ్ల సాగర్, బండ్ల గుంపు వెంకటాపురం,పిట్టతోగు, రేగళ్ల,సుందరయ్య నగర్, ఉమేష్ చంద్ర నగర్, ఎస్టి కాలనీ గుంపు,వేగులూరు, సీతా నగర్ తదితర ఆదివాసి గిరిజన గ్రామాలకు చెందినా ప్రజలు మౌలిక సదుపాయాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రహదారి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం లేక గిరిజనులు ఆదివాసీలు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. రహదారి లేక ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని,కొన్ని గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు కూడా లేవని తెలిపారు. సిఎం ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆదివాసీలు గిరిజనులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. ఆదివాసి గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గిరిజన గూడేలలో ముందస్తు ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రభుత్వం ఉచిత దోమతెరల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని, మణుగూరు ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్, పలువురు ఆదివాసీలు పాల్గొన్నారు.