తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పారదర్శకంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణకు చర్యలు

పారదర్శకంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణకు చర్యలు
–ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహణకు అవసరమైన బృందాలు ఏర్పాటు
-ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పు అందేలా పక్కా చర్యలు

-క్రిటికల్, అర్బన్ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్, సిసి టివి కేమేరాల ఏర్పాటుకు చర్యలు
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
 భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : 
లోక్ సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి బ్యాలెట్ పేపర్ ముద్రణ, హోం ఓటింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో  ఐ డి ఓ సి  నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, అదనపు కలెక్టర్ లు  డి వేణుగోపాల్, విద్యాచందన  లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ,  పార్లమెంట్ స్థానానికి పోటిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు ర్యాండమై జేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఈవిఎం యంత్రాలపై బ్యాలెట్ పత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.  రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి అవసరమైన మేర పోస్టల్ బ్యాలెట్ పేపర్లు అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా పంపిణీ చేయాలని సూచించారు.
పారదర్శకంగా హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని,  అవసరమైన  బృందాలను ఏర్పాటు చేయాలని, మే 3 నుంచి మే 6 వరకు మొదటి విడత, మే 8న రెండవ దశ హోం ఓటింగ్ పూర్తి చేయాలని, హోం ఓటింగ్ షెడ్యూల్ సమాచారం ముందస్తుగా సంబంధిత ఓటర్లకు అందించాలని, ఇంటి వద్ద ఓటు వేసే సమయంలో ఓటు గోప్యత కాపాడేలా చూడాలని, మొత్తం ప్రక్రియ వీడియోగ్రఫీ చేయాలని అన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో తుది ఓటర్ జాబితా రూపొందించామని, ప్రతి ఓటర్ కు ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ  అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని,  వేసవి కాలంలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ లైన్ల వద్ద నీడ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, జిల్లాలో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్న పోలింగ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని,  మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కేమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ,  ఓటరు తుది జాబితా రూపొందించి గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు అందజేశామని, ఓటర్ సమాచార స్లిప్పులను  ప్రతి ఓటర్ కు అందేలా బూత్ స్థాయి అధికారులతో పంపిణీచేస్తున్నామని, హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారి వివరాలు ఓటర్ జాబితాలో స్పష్టంగా మార్క్ చేశామని అన్నారు.
 భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలో పెండింగ్ లో ఉన్న 1889 ఓటరు గుర్తింపు కార్డులు మరో 4 రోజుల్లో వస్తాయని, వాటిని త్వరితగతిన పంపిణీ చేస్తామని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 35 మంది, మహబూబాబాద్ పార్లమెంట్  పరిధిలో 23 అభ్యర్థులు పోటీలో ఉన్నారని, మొత్తం 1105 పోలింగ్ కేంద్రాలకు గాను ఇప్పటివరకు1385 బ్యాలెట్ యూనిట్లు,1385 కంట్రోల్ యూనిట్లు,1551 వివి ప్యాడ్లు  కేటాయించడం జరిగిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేశామని, హోమ్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేశామని, మే 4 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఓటర్ల సీక్రసీ సంరక్షణకు చర్యలు తీసుకుంటామని, హోమ్ ఓటింగ్ షెడ్యూల్, వివరాలు పోటీలో ఉన్న అభ్యర్థులకు అందజేశామని అన్నారు.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఈవిఎం యంత్రాల డిస్ట్రిబ్యూషన్,రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రిసెప్షన్ కేంద్రం నుంచి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ కు పోలింగ్ సామాగ్రి తరలించేందుకు ప్రణాళిక బద్ధంగా కట్టుదిట్టమైన భద్రతతో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, క్రిటికల్, అర్బన్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, సీసీ కేమేరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికలలో ప్రలోభాలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని,  స్టాటిక్ సర్వే లెన్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్, అకౌంటింగ్, వీడియో సర్వేలెన్స్, వీడీయో వ్యూయింగ్ బృందాలు పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నాయని, 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. గతం కంటే పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని, ఓటింగ్ లో ప్రతి వర్గానికి చెందిన ప్రజలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, పరిశ్రమలు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు, వివిధ సంఘాలతో ఓటింగ్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *