ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణ
ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణ
-పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్ లు అనుమతించవద్దు
-ప్రతి ఎంపిడిఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు.
ఇంటర్, 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ లతో రివ్యూ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , డీజిపి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ఇంటర్, 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయని, ఈ నెల 19 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇంటర్, 10వ తరగతి పరీక్ష కేంద్రాల లోపలికి ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలులేదని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టంగా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సీఎస్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా అవసరమైన రూట్లలో బస్సు సర్వీసులు నడపాలని, కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా సజావుగా పరీక్ష నిర్వహించాలని సీఎస్ సూచించారు. ప్రతి ఒక్క అర్హుడికి ప్రభుత్వ గ్యారెంటీ పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో, అదే విధంగా మున్సిపాలిటీలో అవసరమైన మేర ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎస్ తెలిపారు . ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు కోసం అవసరమైన మేర డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించాలని, ప్రతి ప్రజా పాలన సేవా కేంద్రంలో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్ తదితర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని సిఎస్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకొని రావద్దని, ఈ అంశాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ప్రతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్, 10వ తరగతి పరీక్షలు జిల్లాలో సమర్థవంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగవద్దని తెలిపారు. ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాలను అమలు చేస్తుందని అన్నారు ఇందుకోసం లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ చేసిందని అన్నారు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ సంఖ్య, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ ప్రజా పాలన దరఖాస్తుల్లో సమర్పించిన వారందరికీ పథకాలు అమలు అవుతాయని అన్నారు. ఇప్పటి వరకు సదరు సమాచారం ప్రజాపాలన దరఖాస్తులలో సమర్పించని వారు ప్రజా పాలన సేవా కేంద్రాలలో తమ వివరాలు అప్డేట్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్,డి ఆర్ డి ఏ పి డి విద్యా చందన, జడ్పీ సీఈఓ ప్రసూన రాణి, ఇంటర్మీడియట్ అధికారిని సులోచన, జిల్లా విద్యాశాఖ అధికారివెంకటేశ్వర చారి, ఎస్సీ ఎన్పీడీసీఎల్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కొత్తగూడెం శేషాంజన్ తదితరులు పాల్గొన్నారు.