ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
-నిబంధనల ప్రకారం నామినేషన్ల స్క్రుటిని ప్రక్రియ
-ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహణకు అవసరమైన బృందాలను సన్నద్దం చేయాలి
-ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు
-ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పు అందేలా పక్కా చర్యలు
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం , శోధన న్యూస్ : సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్క్రూటీని, బ్యాలెట్ పేపర్ ముద్రణ, హోం ఓటింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా , అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ఓటరు తుది జాబితా రూపొందించాలని, ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు అందించాలని తెలిపారు.
ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్పు పంపిణీ కోసం నిర్దేశిత షెడ్యూల్ రూపొందించి బూత్ స్థాయి అధికారుల ద్వారా ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, వేసవి కాలంలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్ లైన్ల వద్ద నీడ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, జిల్లాలో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్న పోలింగ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సిసి కేమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
నామినేషన్ల స్వీకరణ చివరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారుల కార్యాలయం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్. ఓ. కార్యాలయం బయట, లోపల గడియారం ఏర్పాటు చేయాలని, ఏప్రిల్ 25 మధ్యాహ్నం 3 గంటల లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని అన్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటీని ప్రక్రియ భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పక్కాగా నిర్వహించాలని అన్నారు. ఖచ్చితమైన కారణాలు ఉంటే మాత్రమే నామినేషన్ తిరస్కరణ చేయాలని అన్నారు.నామినేషన్ స్క్రుటిని ప్రక్రియ ముగిసిన తర్వాత ఆమోదించిన నామినేషన్ వివరాలు హార్డ్, సాఫ్ట్ కాపీలు సమర్పించాలని అన్నారు. ఏప్రిల్ 29 నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటిలో ఉన్న అభ్యర్థుల వివరాలను హర్డ్,సాఫ్ట్ కాపీలు సమర్పించాలని అన్నారు. పోటిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈవిఎం యంత్రాలపై బ్యాలెట్ పత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫారం 12డీ కింద ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించు కునేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కునేందుకు దరఖాస్తు చేసుకున్న అత్యవసర విధుల నిర్వహణ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు.
ఇంటి వద్ద నుంచి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల ఓట్ల స్వీకరణకు అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేయాలని, పక్కా షెడ్యూల్ రుపోందించి ఆ సమాచారం దరఖాస్తుదారులకు అందించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నమోదుకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ సిద్దం చేయాలని అన్నారు. మే 13న పకడ్బందీగా పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ విధులలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మే 13న ఉదయం మాక్ పోల్ నిర్వహించాలని, ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని, పోలింగ్ ప్రక్రియలో ఈవీఎం యంత్రాలు ఇబ్బందులకు గురైతే వెంటనే రిజర్వ్ ఈవిఎం యంత్రాలను సెక్టార్ అధికారులు మార్చే విధంగా సన్నద్ధంగా ఉండాలని అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి అవసరమైన నివేదికలు పకడ్బందీగా నమోదుచేసి అందించేలా జాగ్రత్తలు వహించాలని, పోలింగ్ శాతంపై అందించే నివేదికలు పక్కాగా ఉండాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారం అందేలా చూడాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అందించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులతో మాట్లాడుతూ, ఓటర్ల తుది జాబితా రూపొందించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి అందించాలని అన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణి పకడ్బందిగా జరిగేలా చూడాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమేషన్ ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని అన్నారు.