విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి.
విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి.
-కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.
జమ్మికుంట, శోధన న్యూస్ : శాస్త్ర సాంకేతిక రంగంతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా పరికరాల తయారీ విధానం, వాటి పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మన జీవన విధానంలో అవి ఏ విధంగా ఉపయోగపడుతాయని తెలుసుకున్నారు. హజీరా అనే 9వ తరగతి విద్యార్థి చంద్రగ్రహణం ఏర్పడే విధానంపై తయారుచేసిన పరికరాన్ని విద్యాశాఖ యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేయాలని డీఈవోను ఆదేశించారు. చాలా చక్కగా పరికరాలు తయారు చేశారని విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మున్ముందు మరిన్ని సైన్స్ పరికరాలు తయారు చేసి ప్రతిభ చాటాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రావు, ఎంఈఓ విడుపు శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం ఆకుల సదానందం ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.