ప్రజాసమస్యలు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలి
ప్రజాసమస్యలు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలి
- వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనిచేయాలని ఆదేశం
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
- మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : మండల స్థాయి అధికారులు నిత్యం గ్రామాలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. పినపాక మండలంలోని పినపాక, సీతంపేట, బోటిగూడెం గ్రామ పంచాయతీలలో సుమారు ఐదు గంటల పాటు సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి, గ్రామాలలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత పినపాక మండలంలోని మారేడు గూడెం గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పాలచెరువు, వసంతరావు కుంట వరద నీరు గ్రామంలోకి రావడంతో తమ ఇళ్ళు ముంపునకు గురి అవుతున్నాయని తెలపడంతో, వరదనీరు గ్రామంలోకి రాకుండా కాలువకు ఇరువైపులా కట్టనిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ పాఠశాలకు సీసీ రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామానికి సుమారు 80లక్షల రూపాయలతో నిర్మించిన నూతన బ్రిడ్జి, 20లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం పినపాక మండల కేంద్రము లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా 1కోటి 60లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. అన్ని వసతులతో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని, ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు కోసం ఇంకా ఎంత నిధులు మంజూరు చేయించాలో పూర్తి వివరాలతో లిస్ట్ అందించాలని కోరారు. మరో పది రోజుల్లో నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్ వార్డ్ లను పరిశీలించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వైద్య సిబ్బంది 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ప్రజలకు కష్టంతో కాకుండా ఇష్టంతో వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఆసుపత్రి సిబ్బంది పలు సమస్యలు తెలపడంతో వెంటనే జిల్లా వైద్యాధికారితో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ గతంలో నిర్మించిన తరగతి గదులు కుంగిపోయి ఫ్లోరింగ్ రాళ్ళు పగిలిపోవడంతో వెంటనే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పాఠశాలకు పహారిగోడ, బ్రిడ్జి నిర్మాణం చేయించాలని ఉపాధ్యాయులు కోరగా ఎంతమేరకు నిధులు అవసరం అవుతాయో వివరాలు అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చిమొక్కలు, చెత్త మొత్తం తొలగించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ వాటి నిర్మాణం లో నాణ్యత లోపం వలన తొందరగా శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. వెంటనే మరమ్మతులు చేయించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం సీతంపేట, బోటిగూడెం గ్రామపంచాయతీలలో సుమారు 1కోటి రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, కల్వర్టులను ప్రారంభించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు త్రాగునీటి సమస్య ఉన్నదని తెలపడంతో వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తోట సూర్యనారాయణ, ఎంపిడిఓ రాఘవరపు రామకృష్ణ, ఏడూళ్ళ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్, ఎంపీవో వెంకటేశ్వరరావు, విద్యుత్ ఏఈ కావ్య, పీఆర్ ఏఈ రొనాల్డ్, ఆర్ఐ బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, వైస్ ఎంపిపి కింది సుబ్బారెడ్డి, నాయకులు కొర్సా ఆనంద్, ఉడుముల రవీందర్ రెడ్డి, పేరం వెంకటేశ్వరరావు, పరిమి వెంకటేశ్వర్లు, నవ్వాతి శ్రీను, ఆరె శంకర్, బండారు సాంబయ్య, అచ్చా నవీన్, తోలెం కళ్యాణి, గొగ్గల నాగేశ్వరరావు,కొండేరు పుల్లయ్య, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.