కేసుల సత్వర పరిష్కారమే ధ్యేయం కావాలి
కేసుల సత్వర పరిష్కారమే ధ్యేయం కావాలి
కామారెడ్డి లో రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానం ప్రారంభం
కామారెడ్డి, శోధన న్యూస్: కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలని కామారెడ్డి జిల్లా హై కోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి అన్నారు. కామరెడ్డి జిల్లా న్యాయస్దాన భవనములందు నూతన రెండవ అదనపు ప్రధమ శ్రేణి న్యాయస్థానంను వర్చువల్ పద్దతిన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేసులు త్వరగా పరిష్కరించడమే తమ ద్యేయమని, కోర్టులకు వెళ్ళితే సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కక్షిదారులల్లో కలిగేలా న్యాయ వ్యవస్థ పని చేయాలని హితవు పలికారు. పెరుగుతున్న జనాభా కనుగుణంగా న్యాయస్థానాల ఏర్పాటు ఆవశ్యకత కూడా పెరిగిందన్నారు. కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలని, ఏళ్ల తరబడి కేసులు పెండింగులో ఉండడం మంచిది కాదని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరచిన చట్టాలకనుగుణంగా అందరు నడుచుకొని పెండింగు కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. న్యాయ వ్యవస్థకు బార్ – బెంచ్ రెండు చక్రాలంటివని, రెండు సక్రమంగా పని చేస్తేనే కేసులు సత్వర పరిష్కారమై కక్షిదారులకు న్యాయం చేకూర్చిన వారవుతామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాల్లో ఎస్సి/ఎస్టీ కోర్టు, మరొక సివిల్ కోర్ట్ అవసరం ఉందని అన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ, న్యాయమూర్తులు కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు హాలు, జడ్జి ఛాంబర్ ను సందర్శించి పూజలు నిర్వహించారు. రెండవ అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానం జడ్జిగా జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్ ఇంచార్జి భాద్యతలు తీసుకుని ఆసీనులయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్. శ్రీదేవి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధుశర్మ, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి లాల్ సింగ్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.