పథకాలను ప్రజల ధరి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
పథకాలను ప్రజల ధరి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
-నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
– తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
అశ్వరావుపేట , మే- శోధన న్యూస్ :
పథకాలను ప్రజల ధరి చేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం లో సుమారు రూ 37.64 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన అనంతరం అశ్వరావుపేట నియోజకవర్గం జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామ రెడ్డి ,అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐ టిడిఏ పి ఓ రాహుల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు కమలాపురం సబ్, అంకంపాలెం లో 130 కె వి సబ్ స్టేషన్ కూడా మంజూరు చేస్తే అశ్వరావుపేట నియోజకవర్గంలో విద్యుత్ కు ఎటువంటి అంతరాయం ఉండదని విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలం కూడా ఉన్నదని అధికారులు వివరించారు. దానికి గాను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పందించి వెంటనే సబ్ స్టేషన్ల ఏర్పాటు, అశ్వరావుపేట నియోజకవర్గం లో డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎండీని ఆదేశించారు.అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన గిరిజనులు అధికంగా నివసించే ఈ అశ్వరావుపేట నియోజకవర్గం అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని దానిని అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి తీసుకు వెళ్ళగలిగితే ప్రభుత్వం విజయం సాధించినట్టే అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే బాధ్యత ప్రతి అధికారి మీద ఉందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎటువంటి మొహమాటలు లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడున్నర కోట్ల మంది ప్రజలకు హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిందని వాళ్ల నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.ఉద్యోగస్తుల సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆలోచనలో ఉందని, ఉద్యోగస్తుల సమస్యలను కూడా కొద్ది రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. అధికారుల భాగస్వామ్యంతోనే పాలన ప్రజలకు అందించాలని, ప్రజలకు అందించ లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది కాబట్టి బలమైన ప్రజాస్వామ్య రాష్ట్రంగా బాగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా దేశంలోనే రైజింగ్ తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ మోడల్ గా ఈరోజు దేశం మన వైపు చూస్తున్న క్రమంలో ప్రభుత్వంతో పాటు అధికారుల కు కూడా విజయాలలో భాగస్వామ్యం ఉంటుందన్నారు.
– ప్రతి పేదవాడికి ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి –
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయింది కానీ ఇంకా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పూర్తి దిశలోకి రాలేదని, రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభూత్వ ఆలోచనను సామాన్య ప్రజలకు,గిరిజన ప్రాంతాల అభివృద్ధి చేయడానికి అధికారులు దృష్టి సారించాలన్నారు. ఇరిగేషన్ సంబంధించి ఏవైతే గతంలో డ్యామేజ్ అయిన ట్యాంకులు, నూతనంగా మంజూరైన పనులు ఈ సీజన్లో పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారురానున్న వర్షాకాలంలో గిరిజన ప్రాంతంలో వైద్య సేవలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి మరియు ఐటిడిఏ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
సన్న బియ్యం పథకం అమలులో భాగంగా అర్హులైన వాళ్లకి ఇప్పటికే సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని ఇంకా మిగిలిన వారిని కూడా గుర్తించి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ఆలోచనతో రూపొందించిన రాజీవ్ యువ వికాసం లో భాగంగా నియోజకవర్గానికి 4500 మందికి ఒక్కొక్కరికి 5 లక్షలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మరియు శాసనసభ్యులు పూర్తి సహకారం అందిస్తారని, ప్రభుత్వ ఆలోచనలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే ప్రధానమైన పాత్ర అధికారులు బాధ్యతాయుతమైన ఉద్యోగస్తులపైనే ఉందని మంత్రి తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి కొరకు అధికారులు స్థానిక శాసనసభ్యుల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.