పరీక్ష ప్రశ్నాపత్రాలను తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో అందించాలి
పరీక్ష ప్రశ్నాపత్రాలను తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో అందించాలి
మణుగూరు, శోధన న్యూస్: సింగరేణి సంస్ధ ప్రయోజనాలు, కార్మిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం నిర్వహించే ప్రతి అంతర్గత పోస్ట్ కు సంబంధించిన ప్రశ్నాపత్రాలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ భాషలలో నిర్వహించాలని కోరుతూ ఏరియా ఎస్ఓటు జీఎం డి శ్యామ్ సుందర్ కి మణుగూరు ఏరియా టిబిజికెఎస్ నాయకులు నాగెల్లి వినతి పత్రాన్ని అందజేశారు. యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే ఎలాంటి సిలబస్ అడుగుతారో తెలియజేయడం వల్ల కార్మికుడి విలువైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నైపుణ్యత, సమర్థతతో కూడిన కార్మికులు సంస్థకు అందుతారని అన్నారు. దానివల్ల నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పి ఆపరేటర్ టెస్ట్ లో వ్రాత పరీక్ష కు 25 మార్కులు కేటాయించడం జరిగిందని, ఆ మార్కులను ప్రత్యేక కాలములో చూపించే విధంగా యాజమాన్యం చొరవ చూపాలని తెలిపారు. విభాగాల వారీగా మార్కులు తెలియజేయడం వల్ల కార్మికుడు ఎక్కడ తన నైపుణ్యాన్ని కోల్పోయినాడో తెలుసుకొని రానున్న రోజుల్లో జరిగే ప్రతిభా పరీక్షలకు తప్పులు చేయకుండా సరిదిద్దుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు. మణుగూరు ఏరియా లో అంతర్గత పోస్ట్ లకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు అందించాలని, తద్వారా సంస్థకు మేలైన ప్రయోజనాలు అందుతాయని ఈ సందర్భంగా ఆయన వినతిపత్రం ద్వారా యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, ముకేష్, సుధాకర్, నాగేశ్వర రావు, మస్తాన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.