మణుగూరు ప్రజల సమస్యలను పరిష్కరించాలి – సిపిఎం సీనియర్ నాయకులు వెంకట్రావు
మణుగూరు ప్రజల సమస్యలను పరిష్కరించాలి
– సిపిఎం సీనియర్ నాయకులు వెంకట్రావు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటి పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని పరిష్కరించాలని సిపిఎం సీనియర్ నాయకులు సంకినేని వెంకట్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటిలోని కాళిమాత ఏరియా, సుందరయ్యనగర్, శేషగిరినగర్, బాలాజీనగర్, మెయిన్ రోడ్ ఏరియా తదితర ప్రాంతాల్లో అపరిశుభ్రం దర్శనిమస్తోందని, పలు వీధిల్లో వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ పైప్లాన్ పేరుతో అనేక ప్రాంతాల్లో సీసీరోడ్లను తవ్వి అలాగే వదిలేశారని, తద్వారా రోడ్లు అద్వాన్నంగా మారాయని తెలిపారు. మున్సిపాలిటి అధికారులు తక్షణమే స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, సీసీరోడ్లకు మరమ్మత్తులు చేయాలని తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సత్రపల్లి సాంబశివరావు, బొల్లం రాజు, నందం ఈశ్వర్రావు, గడ్డం ముత్తయ్య, లక్ష్మయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.