ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం
ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం
-తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు
–రూ. 130 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, రహదారులకు సంబంధించి సుమారు 130 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, జిల్లా ఇంచార్జ్ మంత్రి, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వ్యవసాయ, మార్కెటింగ్, కార్పొరేషన్, జౌలీ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉపముఖ్యమంత్రి పట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్ని రకాల ఆటంకాలు ఉన్న.. రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తామని, ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం, ఈ కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరని ఆయన అన్నారు. ఇక రైతు భరోసా విషయానికొస్తే ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి అన్నది ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చకు పెట్టి చట్టం చేసి కచ్చితంగా రైతు భరోసా ఈ రాష్ట్ర రైతులకు అందజేస్తామన్నారు. ప్రజల సొమ్ము నిరుపయోగం కాకుండా, ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామన్నారు. గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఖజానాను దోపిడీ చేశారు, ఎవరికి పడితే వారికి పంచారు.. 7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం మాత్రం రూపాయి రూపాయి పోగు చేసి అర్థవంతంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తుందన్నారు. సంపదను సృష్టిస్తాం.. ఆ సంపదను రాష్ట్ర ప్రజలకు పంచుతామని ధీమా వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి గత పది ఏళ్ళు పాలించిన వారు 42 వేల కోట్లు అప్పు తెచ్చారు, అయినా ఇంటింటికి తాగునీరు రాని దుస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కొత్తగూడెం పట్టణంలో తాగునీటి సరఫరాకు సుమారు 130 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చిందని, నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి 150 కోట్లతో తాగునీరు అందించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవకాశం ఉంటే తప్పకుండా మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం పట్టణానికి ఒకటే దారి ఉంది.. ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బందులు ఏర్పడతాయి… ఈ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి గాను స్థల సేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. ఆర్ఓబి నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మంజూరు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్వో బీల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.
కావలసినంత స్థలం, నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నందున రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం, త్వరలోనే శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం తెలిపారు. కొత్తగూడెంలో ఐటీ హబ్ నిర్మాణానికి కావలసిన స్థలం ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తానని, టైర్ టు సిటీ, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం అభివృద్ధికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ఐటి హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గత పాలకులు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 9000 కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలన్నిటిని తెప్పించుకున్నాం, ఆరు నెలల్లో పూర్తి చేయగలిగేవి ఏంటి, ఏడాదిలో, మూడు సంవత్సరాల కాలంలో, ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్న అన్ని ప్రాజెక్టులను గుర్తించామని తెలిపారు. వీటినీ ప్రాధాన్యత క్రమం లో పూర్తి చేసి సాగునీరు అందిస్తాం, త్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని పారిస్తామన్నారు. 70 కోట్లతో వైరా ప్రాజెక్టుకు లింకు కెనాల్ ను అనుసంధానం చేస్తున్నట్టు వివరించారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో 124 కోట్లతో చేపట్టిన ప్రతి ఇంటికి మంచినీరు అందించే పథకం రానున్న ఐదు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా డి ఎం ఎఫ్ టి నాలుగు కోట్ల నిధులతో పట్టణంలోని డ్రైనేజీలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 148 కోట్లతో 12 ఆర్ఓబి లు హేతుబంధు క్రింద మంజూరు అయినవని వాటిల్లో కొత్తగూడెం ఆర్ఓబి కూడా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు. కొత్తగూడెం ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడటం తెలుసుకొని ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఎయిర్ కండిషన్స్ ఏర్పాటు చేశామన్నారు. నా దృష్టికి వచ్చిన జిల్లా సమస్యలు అన్నింటిని జిల్లా ఇన్చార్జి మంత్రిగా పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కొత్తగూడెం పట్టణంలో తాగునీటి సమస్య ఉండేదని, గత ప్రభుత్వం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. ఈనాడు పేదల ప్రభుత్వం పట్టణంలోని మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడం జరిగిందన్నారు. సుమారు 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా మంచినీటి పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో ఇంకా కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అన్ని వర్గాల వారికి ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేశామన్నారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సుమారు 35000 కోట్లతో రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. గోదావరి నీటితో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం రాజకీయ ధన లబ్ధి కోసం దొరికిన కాడికి అప్పులు చేసి కనీసం ఒక ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని తెలిపారు. పేదోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ట్రైల్ రన్ ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసాం అని, రైతులను రాజులను చేస్తామన్న ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటిని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్థికపరమైన ఇబ్బందుల వలన అనేక విభజన సమస్యలు ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి విజయవాడ హైదరాబాద్ ఆరు లైన్ల రోడ్డు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు తీసుకువచ్చారని, అదేవిధంగా కొత్తగూడెం వయా తొర్రూర్ ఇల్లందు మీదుగా వలిగొండ కు జాతీయ రహదారి మంజూరు అయిందని, సగం టెండర్లు పూర్తి అయినవి మిగతావి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ జిల్లా వాసిగా కొత్తగూడెం లో నీకు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి గాను ఆ సీతారామస్వామి వారి ఆశీస్సులతో సీతారామ ఎత్తిపోతల పథకం లో భాగంగా ట్రయిల్ రన్ ద్వారా పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు అంకురార్పణ జరిగిందన్నారు. ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి చొరవతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సీతారామ ప్రాజెక్టు పనులను ముందు సాగించడానికి నిధులు సమకూరుస్తామని వారు హామీ ఇచ్చారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో మిగిలిన సెకండ్ ఫేస్, థర్డ్ ఫేస్ పనులను కూడా ఈ సంవత్సరం లో పూర్తిచేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోదావరి జలాలను ఉపముఖ్యమంత్రి నియోజకవర్గానికి తరలిస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రానున్న రోజుల్లో జాతీయ రహదారులు తోపాటు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రైతులు, ప్రజా ప్రతినిధులు, మరియు ప్రజల నుండి అభిప్రాయ సేకరణ తీసుకొని విధివిధానాలు రూపొందించే పని ఉప సంఘం ఇప్పటికే మొదలు పెట్టిందని, త్వరలో రైతు భరోసా పై పూర్తిస్థాయి విధివిధానాలు చేయడం జరుగుతుందన్నారు. కొత్తగూడెం జిల్లా అని పామాయిల్ సాగుకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
అనంతరం సభాధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయడం మరియు శంకుస్థాపన చేయడానికి ఉపముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాకు విచ్చేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సి తీన్మార్ మల్లన్న, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మాజీ ఎంఎల్సి బాలసాని లక్ష్మీ నారాయణ, డిసిసిబి చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మున్సిపల్ కమీషనర్ శేషాంజన్ స్వామి, ఇంజనీర్లు రవికుమార్, రాము, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మిత్రపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.