తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

  బాధితులకు సత్వర న్యాయం చేయాలి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : 
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర  న్యాయం అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.  బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 34 అండర్ ఇన్వెస్టిగేషన్ అట్రాసిటీ కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా, నిబంధనల ప్రకారం విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.

అత్యాచారానికి గురైన మహిళలకు భరోసా కల్పించేందుకు భరోసా కేంద్రం ద్వారా అవసరమైన సహాయం, మానసిక ధైర్యం అందేలా చూడాలని సూచించారు. అలాగే పాఠశాల స్థాయిలోనే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు యుడైస్ (యు డి ఐ ఎస్ యు) సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు స్థితిగతులపై సమగ్ర నివేదికలు అందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని, వాటిపై క్షేత్రస్థాయిలో కమిటీల ద్వారా యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో జనవరి 18, 19 తేదీల్లో కమిటీ సభ్యులను హైదరాబాద్ శిక్షణ కేంద్రాలు, పాల్వంచలోని చరిత ఆర్గానిక్ ఫారం, పట్టుపురుగుల పరిశ్రమ, లోతువాగులోని సమీకృత వ్యవసాయం, మోరంపల్లి బంజర మోడల్ ఫామ్ హౌస్, మిట్టగూడెం చేపల పెంపకం యూనిట్‌లకు అధ్యయన సందర్శనకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ…ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో చట్టపరమైన అన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. బాధితుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, కేసుల విచారణలో ఎలాంటి అలసత్వం వహించబోమన్నారు. బాధితులు న్యాయం పొందే వరకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, అవసరమైతే ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, సూపర్డెంట్ హనుమంతరావు, సీనియర్ సహాయకులు ప్రసాద్, జిల్లా విజిలెన్స్ అండ్ మహా ఎడిటింగ్ కమిటీ సభ్యులు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీబాయి, కార్యాలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *