ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత తీసుకుంటాం.
ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత తీసుకుంటాం
వరంగల్ ,శోధన న్యూస్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని, అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
శనివారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం నాగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, కమలాపూర్ మండలం అంబాల, కమలాపూర్ మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ సందర్భంగా ఆయా కేంద్రాల నిర్వహకులు, స్థానిక రైతులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఏ రోజు నుండి ధాన్యం వస్తుంది, ఎంత కొనుగోలు చేశారు, ధాన్యంలో తేమశాతం ఎంత ఉంటుంది, ఎంతమంది రైతులు ధాన్యం ఆరబోశారు, ఏ ఏ రకం ధాన్యం వస్తుంది, ధాన్యం శుభ్రపరిచే యంత్రం (ప్యాడీ క్లీనర్ )ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉందా, కొనుగోలు చేసే ధాన్యాన్ని ట్యాగింగ్ చేసిన ఏ ఏ మిల్లులకు తరలిస్తున్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను నమోదు చేస్తున్న విషయం, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు ఉన్నాయా, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిధిలో ఎంత ధాన్యం వస్తుందని అంచనా వివరాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకానికి సంబంధించిన ఏర్పాట్లు, తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకాలు కొనసాగుతుండగా వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైందన్నారు. పది రోజుల క్రితమే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఐకెపి, పిఎసిఎస్ ల ద్వారా 150 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా మొత్తం సీజన్ కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోళ్ళను వెంటనే ప్రారంభించాలని, తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు. ధాన్యంలో తేమ శాతం లేకుండా చూసుకోవాలని, ధాన్యం నాణ్యంగా ఉండే విధంగా రైతులు చూసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలు లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం శుభ్రపరిచే యంత్రం ( ప్యాడి క్లీనర్ )అందుబాటులో ఉండాలన్నారు. ధాన్యం శుభ్రపరిచే యంత్రంతో ధాన్యాన్ని శుభ్రం చేయించాలన్నారు. ధాన్యంలో తేమ, తాలుశాతం లేకుండా రైతులు చూసుకోవాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను నమోదు చేసి రైతులకు పేమెంట్ అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.