ఖమ్మం జిల్లాలో భారీగా పోలీస్ భద్రత ఏర్పాట్లు
ఖమ్మం జిల్లాలో భారీగా పోలీస్ భద్రత ఏర్పాట్లు
మధిర, శోధన న్యూస్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో భారీగా భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కాజీపురం గ్రామం వద్ద ఓటింగ్ కు అవసరమయ్యే సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా వున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలలో పోలీసుల విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ఓటరు పోలింగ్ కు కదిలేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి తగిన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 390 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మొహరించినట్లు తెలిపారు.ఓటింగ్ కు అవసరమయ్యే సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేర్చేలా బందోబస్తు చేపట్టారని, పోలింగ్ తో పాటు ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు రోజున కట్టుదిట్టమైన భద్రత కల్పించేలా పోలీస్ కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు.పోలీస్ సిబ్బందికి అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పనిచేయాలన్నారు.ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లు తమ ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్, పోలింగ్ స్టేషన్ చుట్టూ తిరగకుండా చూసుకోవాలన్నారు. ఓటింగ్ చివరి గంటలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్ యొక్క 100 మీటర్ల వ్యాసార్థంలో గుమిగూడడం, వాహనాలు నిలపడం వంటి లేకుండా చూడలన్నారు. పోలీస్ స్టేషన్, ఎస్ హెచ్ ఓ, మొబైల్ పార్టీ ఇంచార్జీ క్యూఆర్టి, ఎస్ఎస్టి మొదలైన ముఖ్యమైన ఫోన్ నంబర్‌లను సిబ్బందికి ఇచ్చిన డ్యూటీ పాస్‌పోర్ట్ పొందుపరిచినట్లు తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మీ పరిధిలోని మొబైల్ పార్టీకి లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం తెలియజేయాలన్నారు. ఓటర్లను క్యూలైన్లో నిలబెట్టాలని, అగ్గిపెట్టెలు, యాసిడ్, సెల్ ఫోన్లు, ఇంక్ పెన్నులు, నీళ్ల సీసాలు, మారణాయుధాలు, తుపాకీలు మొదలైన నిషేధిత పదార్థాలతో ఎవరినీ పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతించవద్దన్నారు. ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకంగా అభ్యర్థించకపోతే ఏ పోలీసు అధికారి పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకూడదన్నారు.144 సెక్షన్ అమలులో వున్న నేపథ్యంలో గుంపులుగా వుండకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఏసిపి రవి సిఐ వసంత్ కుమార్ ఉన్నారు.