ఖాకీ యూనిఫామ్ త్యాగానికి, సేవకు ప్రతీక
ఖాకీ యూనిఫామ్ త్యాగానికి, సేవకు ప్రతీక
– మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక్
–ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
మహబూబాబాద్, శోధన న్యూస్: ఖాకీ యూనిఫామ్ త్యాగానికి, సేవకు ప్రతీకగా నిలుస్తుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక్ అన్నారు. పో లీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ1959 అక్టోబర్ 21 నాడు భారత భద్రతా దళాలపై చైనీయులు చేసిన దాడిలో అమరత్వం పొందిన దళాలకు స్మారకంగా నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో పోలీస్ శాఖలో పనిచేస్తూ ఎన్నో ఒడి దిడుగులను ఎదుర్కొని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరులకు ఘన నివాళులు అర్పించడంతోపాటు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మారుతున్న సమాజంలో భాగంగా టెక్నాలజీలో వచ్చిన మార్పుల దృష్ట్యా పోలీసు శాఖ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, గతంలో సంఘ విద్రోహక శక్తుల నుండి మాత్రమే సవాళ్లు ఎదురయ్యేవని, సైబర్ ఎటాక్ ద్వారా టెక్నాలజీకి సంబంధించిన ఇతర అంశాల ద్వారా అనేక సవాళ్లను పోలీస్ శాఖ ఎదుర్కొంటుందని కలెక్టర్ తెలిపారు. మారుతున్న పరిస్థితులను తెలంగాణ పోలీస్ నవీకరించుకుంటూ దేశంలోనే అత్యున్నత పోలీసుగా మన్నలను పొందుతుందని అన్నారు. కర్తవ్యాన్ని నిర్వర్తించడంతోపాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో పోలీస్ శాఖ ముందంజలో ఉంటుందన్నారు. పోలీస్ శాఖ వివిధ విభాగాల పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో అందిస్తున్న సేవలపట్ల కలెక్టర్ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటామనీ, భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతం, అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైందని అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను పోలీస్ ఫోర్స్ బలగాలు నిర్వర్తించేవన్నారు. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదుర్కొని పోరాడిందన్నారు. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారనీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ పవిత్రస్థలంగా రూపు దిద్దుకున్నదనీ,ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అమరులైన పోలీసుల జీవితాలను మనం మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు, ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావడమని, ఉగ్రవాదం, నక్సలిజం వంటి విచ్చిన్నకర శక్తులతో నేరాలకు ఘోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. ఈ దశలో త్యాగాలకు భయపడకుండా వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించడం జరిగిందన్నారు. సంఘ వ్యతిరేకులు క్రూరమైన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామనీ ఎస్ పి అన్నారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 189 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైనారనీ, తమ జీవితాలను త్యాగం చేసి మన దేశ ఐక్యతను, శాంతి భద్రతలను సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు తీవ్రవాదుల దాడుల నుండి రక్షించారనీ, వారికి ఈవిధంగా ఘన నివాళి అర్పిస్తుండడం గర్వకారణమన్నారు. వారి అమూల్యమైన త్యాగాలు మరచిపోలేనివన్నారు. వారి త్యాగాల వల్ల మన జాతి గర్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.అనంతరం పోలీస్ విధులలో ప్రాణాలను అర్పించిన వారి పేర్లు చదివి వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.