టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరం-టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత
టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరం
-నాయకత్వ బాధ్యతల్లో యువతకు ప్రాధాన్యత
-డిపెండెంట్ ఉద్యోగాల కల్పన కోసం కేసీఆర్ తీవ్ర కృషి
-సింగరేణి సంస్థ కోసం జాతీయ సంఘాలు చేసిందేమీ లేదు
-టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత
ఇల్లందు, శోధన న్యూస్ : సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేసినట్లు ఇల్లందు ఉపాధ్యక్షులు రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశ వివరాలు వెల్లడించారు.ఈ సమావేశం లో కవిత మాట్లాడుతూ కార్మికుల హక్కలు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని సింగరేణి అంటే సింహ గర్జన అని, అదే స్పూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని, సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్పూర్తి జాతీయ సంఘాలకు లేదని స్పష్టం చేశారు. గనుల్లో కార్మికులు చేస్తున్న కష్టం, చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతోందని, కాబట్టి ధైర్యంగా పోరాటం చేయాలని దిశానిర్ధేశం చేశారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లా పనిచేయాలని అన్నారు. మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని, అతిత్వరలో తమ సంఘం మ్యానిఫెస్టోను విడుదల చేస్తుందని ప్రకటించారు.ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వంటి జాతీయ సంఘాలు సింగరేణి హక్కులను ఏనాడూ కాపాడలేదని, భవిష్యత్తు లోనూ సంఘాలను సింగరేణి ఎదుగుదల కోసం ఏమీ చేయలేవని విమర్శించారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండగా ఒక్క సమ్మె కూడా చేసే అవసరం లేకుండా అన్ని పనులను సాధించి పెట్టామని తెలిపారు. సింగరేణి అంటే తమకు ప్రధాన్యత ఉందని, కానీ కాంగ్రెస్ ప్రాధాన్యతల్లో సింగరేణి, ఆ సంస్థ కార్మికులు లేరని తేల్చిచెప్పారు. ఏ అధికారం లేనప్పుడే తెలంగాణ సాధించామని, అలాంటిది కార్మికుల హక్కులు, ప్రయోజనాలు సాధించడానికి సింగరేణి సంస్థ యాజమన్యాన్ని నిద్రపోనివ్వబోమని స్పష్టం చేశారు. తమకు పోరాటాలు కొత్తకాదని, కార్మికుల హక్కులను సాధించే వరకు విశ్రమించబోమని, కార్మికుల పక్షాన ప్రతి నిత్యం నిలబడి ఉంటామని పునరుద్ఘా టించారు. సింగరేణి సంస్థలో దాదాపు 40 వేల ఉద్యోగులు ఉంటే 21 వేల వరకు యువకులు ఉన్నారని ప్రస్తావించారు. కాబట్టి సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు ప్రధాన్యత ఇస్తామని, యువతను సింగరేణిని నడపడంలో చోదక శక్తిగా తీర్చిదిద్దుతామని అన్నారు. అన్ని కమిటీల్లోనూ యువతకు సరైన ప్రాధాన్యత ఇస్తామని, మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.డిపెండెంట్ ఉద్యోగాల కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కొంత మంది కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, అధికారులు కుదరదని చెప్పినా సరే కేసీఆర్ నిబంధనలను సవరించి వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టారని వివరించారు. కార్మికులు ఆర్థికంగా ఎదగేలా చేయడమే కాకుండా ఆత్మగౌరవం ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలియజేశారు. సింగరేణి పనితీరును మెరుగుపర్చడానికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ చేసిన మంచిపనులను కార్మికుల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేసీఆర్ చేసిన పనులను కార్మికులకు సరిగ్గా చెబితే టీబీజీకేఎస్ కు ఎదురుండదన్నారు.ఈ సమావేశం లో గ్రంధాలయ చైర్మన్ దింగిగల రాజేందర్ పాల్గొన్నారు.