ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం అమలు చేయాలి -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం అమలు చేయాలి
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, శోధన న్యూస్: ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అమలు చేయాలని బిఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, చల్లూర్, చేల్పూర్ గ్రామాల్లో జరిగిన ఆరు గ్యారెంటీ ల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలందరూ ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఆరు గ్యారంటీలలో అర్హులైన వారందరినీ గుర్తించి దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళలందరు ఈ గ్యారంటీలకు తప్పక దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చిన రసీదును జాగ్రత్తపరచుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు జాగ్రత్తగా ఫామ్ నింపాలన్నారు. అధికారులు కూడా అభ్యర్థులు నింపే దరఖాస్తును ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఏవైనా తప్పులు ఉంటే సరిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, సర్పంచ్ నేరెళ్ల మహేందర్, తహసిల్దార్ విజయ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.