కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం
-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
మధిర, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని సీఎల్పీ నేత, కాంగ్రెస్ పార్టీ మధిర అసెంబ్లీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మధిర పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముందుగా మార్నింగ్ వాక్ లో భాగంగా స్విమర్స్ అసోసియేషన్, కలియక వాకర్స్ క్లబ్ సభ్యులను కలిశారు. అనంతరం డాక్టర్ కోట రాంబాబు నివాసంలో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను ఆయన మర్యాదపూర్వకంగా సన్మానించారు. అదేవిధంగా అంబేద్కర్ సెంటర్ నుంచి రాయపట్నం సెంటర్, మెయిన్ రోడ్డులో పర్యటించి వ్యాపారుల వద్దకు వెళ్లి హస్తం గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. మధిర దశ దిశ నిర్దేశించేదిగా ఉండాలని ఆకాంక్షించారు. మధిర సమగ్రాభివృద్ధి తన ధ్యేయమన్నారు. మధిరకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి మాస్టర్ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. మధిరను సుందరమైన పట్టణంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. పత్తి, మిర్చి, వరి, పసుపు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల గౌరవాన్ని పెంచానే తప్ప ఎక్కడా కూడా తగ్గించలేదన్నారు. మధిర ప్రజల బలం, ఓటర్ల ఆశీర్వాదం వల్లనే సీఎల్పీ లీడర్ గా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో పీపుల్స్ ప్రభుత్వం రావాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. ప్రజలు తలదించుకునేలా చిల్లర మల్లర రాజకీయాలు ఎన్నడూ తాను చేయలేదని, మధిర ప్రజలు తల ఎత్తుకొని చూసేలా నిత్యం పతాక శీర్షికలో ఉండే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా చట్టసభలో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, రంగా హనుమంతరావు, మిర్యాల రమణ గుప్త రంగా శ్రీనివాసరావు, కోనా ధని కుమార్, సూరంశెట్టి కిషోర్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పారుపల్లి విజయ్ కుమార్, తూమాటి నవీన్ రెడ్డి, అద్దంకి రవికుమార్, కోట డేవిడ్, దారా బాలరాజు, కర్నాటి రామారావు, సిద్ధంశెట్టి సందీప్ తదితరులు పాల్గొన్నారు.