గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట : తుమ్మల
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నా రాజకీయ జీవితంలో 47 ఏళ్లుగా దమ్మపేట అశ్వరావుపేట ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశానని, ఆది నుంచి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ఎజెండాగా ముందుకు సాగుతున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం దమ్మపేట మండలంలో అల్లిపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ భవనం,రూ. 29 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రహదారితో పాటు కల్వర్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
అనంతరం అల్లిపల్లి గ్రామంలో గ్రామస్తులు స్వయంగా నిర్మించుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను కట్టబెట్టిన సొంత మండలం దమ్మపేట అభివృద్ధి కోసం ఆది నుంచి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దమ్మపేట, అశ్వరావుపేట ప్రజల ఆశీర్వాదం వల్లనే ఈరోజు అన్ని ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగే భాగ్యం కలిగిందన్నారు. ఇక్కడి రైతులు పామాయిల్ రంగంలో రాణిస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఈ ప్రాంతాల అభివృద్ధిని చూసి పక్క రాష్ట్ర ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారని, దమ్మపేటను ఆ రోజుల్లోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని స్వయంగా ఎన్టీ రామారావు అభినందించారని చెప్పారు.