కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి దుర్మార్గం
కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి దుర్మార్గం
-బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
పినపాక నియోజకవర్గం, ఏప్రిల్ 4 శోధన న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం దుర్మార్గమని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం క్యాంపు కార్యాలయానికే రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసులు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ రోజులు దగ్గరపడ్డాయని, అందుకే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధి కోసం అధికారాన్ని అప్పగిస్తే, ప్రభుత్వం దాడులు, కూల్చివేతలు చేపడుతుందా అని మండిపడ్డారు. ఇది ప్రజల విశ్వాసానికి విరుద్ధమని అన్నారు.
ప్రతిపక్షాలపై దాడులు చేయడం హీరోఇజం కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే నిజమైన పరిపాలన అని సూచించారు. ఆరోగ్య హామీలు సహా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇటువంటి దాడులకు తాము భయపడబోమని, వెనుకడుగు వేయబోమని అన్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలని, ప్రజల ఆస్తుల రక్షణలో విఫలమవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా బాధ్యులపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, జరిగిన ప్రతి అన్యాయానికి సమాధానం చెబుతామని అన్నారు.


